సాధారణంగా ధనియాల మొక్క 2–3 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. కానీ ఉత్తరాఖండ్‌కు చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు గోపాల్‌ ఆపిల్‌ తోటలో ధనియాల మొక్క ఏకంగా ఏడు అడుగుల ఒక అంగుళం ఎత్తు పెరిగింది. ఇది గిన్నిస్‌ రికార్డ్‌. గతంలో ధనియాల మొక్క 5.9 అడుగుల ఎత్తుగా గిన్నిస్‌ బుక్‌లో నమోదై ఉంది. కొద్ది కాలం క్రితం గోపాల్‌ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ నుంచి సర్టిఫికెట్‌ అందుకున్నారు.

గోపాల్‌ దత్‌ ఉప్రేటి స్వతహాగా సివిల్‌ ఇంజనీర్‌. ఢిల్లీలో భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న ఆయన ఐరోపా పర్యటనకు వెళ్లినప్పుడు సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యతను తొలిసారి గుర్తించారు. తర్వాత కొన్నేళ్లకు ఉద్యోగానికి రాజీనామ చేసి ఉత్తరాఖండ్‌ రాష్ట్రం రాణిఖేత్‌ ప్రాంతంలోని స్వగ్రామం బిల్‌కేష్‌కు తిరిగి వచ్చారు. 2015 నుంచి తనకున్న మూడెకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు 8 ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తున్నారు. ఆయన తోటలో 2వేల ఆపిల్‌ చెట్లున్నాయి. వాటి మధ్య వందలకొద్దీ ఎత్తయిన ధనియాల మొక్కలు కనిపిస్తాయి. అల్లం, పసుపు కూడా అంతర పంటలుగా సాగు చేస్తున్నారు. ఆయన తోటలో ధనియాల మొక్కలు బాగా ఎత్తుగా వుండటం చూసిన వారు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసే వరకు ఆ విషయాన్ని ఆయన గుర్తించకపోవడం గమనార్హం.

ఈ నేపథ్యంలో స్నేహితుల సూచన మేరకు స్థానిక ఉద్యాన శాఖ అధికారిని ఆహ్వానించి తన తోటలోని ధనియాల మొక్కల ఎత్తును కొలిపించాడు గోపాల్‌. ఎక్కువ శాతం మొక్కలు ఐదు అడుగుల వరకు ఎత్తు ఉండగా, ఒక మొక్క మాత్రం ఏడు అడుగుల ఒక అంగుళం ఎత్తు పెరగటం గుర్తించి నమోదు చేశారు. 2020 ఏప్రిల్‌ 21న గిన్నిస్‌ బుక్‌ తన వెబ్‌సైట్‌లో ఇదే అత్యంత ఎత్తయిన ధనియాల మొక్క అని ప్రకటించింది.

నిజానికి, గోపాల్‌ ధనియాల మొక్కలను ఆపిల్‌ చెట్లకు చీడపీడల బెడద తగ్గుతుందన్న ఉద్దేశంతో అంతర పంటగా సాగు చేస్తూ వస్తున్నారు. ధనియాల మొక్క పూలకు ఆకర్షితమై తేనెటీగలు, ఈగలు తోటలోకి వస్తూ ఉండటం వల్ల చీడపీడల బెడద తగ్గిందని ఆయన అంటున్నారు.  స్థానికంగా దొరికే ధనియాలనే విత్తనాలుగా వేశారు. అయితే ఎత్తుగా పెరగటం కోసం ధనియాల మొక్కల కొమ్మలను కత్తిరిస్తూ ఉంటారు. వేపపిండి, జీవామృతం వేస్తూ, గడ్డీ గాదంతో ఆచ్ఛాదన చేస్తూ ఉంటారు. ఇంకా ఏ రకమైన ప్రత్యేక పోషణ అంటూ ఏమీ లేదని గోపాల్‌ తెలిపారు.

అయితే, గత ఐదేళ్లుగా తన తోటలో పెరిగే ధనియాల మొక్కల్లోనే మెరుగైన వాటిని ఎంపిక చేసి, ఆ విత్తనాలనే తదుపరి పంటగా విత్తటం వల్ల అనుకోకుండానే ఓ సరికొత్త ధనియాల వంగడం తయారైంది ఆయన చెప్పారు. ఒక్కో మొక్క అర కేజీ వరకు ధనియాల దిగుబడినివ్వటం ఇక్కడ విశేషం. సాధారణ ధనియాల మొక్క నుంచి 20–50 గ్రాముల మేరకు  దిగుబడి వస్తుంది. ధనియాల పంట విత్తటంలో మెలకువలను గోపాల్‌ ఇలా వివరించారు.. ‘మట్టిలో అర అంగుళం నుంచి అంగుళం లోతులోనే  ధనియాలను విత్తుకోవాలి. రెండు విత్తనాలకు మధ్య 5–6 అంగుళాల దూరం ఉంచాలి. నేలలో తేమ ఆరిపోకుండా ఉండేలా చూసుకోవాలి. అలాగని ఎక్కువ నీరు పోస్తే వేరు కుళ్ళి దెబ్బతింటుది. కుండీలు, మడుల్లో సాగు చేసే వారు ఖచ్చితంగా ఎక్కువైన నీరు బయటకు పోయేందుకు వీలుగా  కుండీ/మడి కింది భాగంలో విధిగా బెజ్జాలు పెట్టాలని సూచించారు. ధనియాల మొక్క ప్రధాన వేరు బాగా లోతుకు వెళ్తుందని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడైనా ధనియాలను సాగు చేసుకోవచ్చన్నారు. ఇతర రైతులకు ఇవ్వటానికి వెయ్యి ధనియాల విత్తనాలను సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు.

Leave A Reply

Exit mobile version