ఎనిమిది సంవత్సరాల వయసులో ‘అమ్మా, నాకు కంప్యూటర్ కావాలి’ అని అడిగాడు అయాన్. ‘ఈ వయసులో కంప్యూటర్ ఎందుకు నాన్నా….బుద్ధిగా చదువుకోకుండా…’ అని కుంజమ్ చావ్లా అన్నారో లేదో తెలియదు, ఒక ఫైన్‌మార్నింగ్ ఆ ఇంటికి కంప్యూటర్ వచ్చింది. ఆ కంప్యూటరే తన తలరాతని మార్చే అల్లావుద్దీన్ అద్భుతదీపం అవుతుందని అయాన్ ఆ క్షణంలో ఊహించి ఉండడు! రకరకాల వీడియోగేమ్స్ ఆడి విసుగెత్తిన అయాన్ దృష్టి ‘ఎడిటింగ్’పై పడింది. వీడియోలు, మూవీలు ఎడిటింగ్ చేసేవాడు. ఈ క్రమంలోనే టెక్నాలజీపై ఆసక్తి పెరిగింది. ‘వీడియోలు సొంతంగా ఎడిట్ చేయగలుగుతున్నాను. వెబ్సైట్లు, సాఫ్ట్వేర్, యాప్‌లు క్రియేట్ చేయగలనా?’ అనే ఆలోచన వచ్చింది. ‘ఇది ఎలా చేయాలి?’ ‘అది ఎలా చేయాలి?’ అని ఎవరినైనా అడిగితే– ‘చదువుపై దృష్టి పెట్టుకుండా ఇవన్నీ నీకెందుకు?’ అని బిడియ పడ్డాడు.
ఆ భయమే తనకు తాను గురువుగా మారే సాదావాకాశం ఇచ్చింది. టెక్నాలజీకి సంబంధించి రకరకాల పుస్తకాలు కొనుక్కొని వాటిలో పురుగు అయ్యాడు. నెట్లో దొరికిన సమాచారాన్ని దొరికినట్లు అవగాహనా చేసుకునే వాడు. మొదట్లో అర్థం కానట్లు, అర్థమై నట్లు….రకరకాలుగా ఉండేది. పదమూడు ఏళ్ల వయసులో కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌కు సంబంధించి పన్నెండు లాంగ్వేజ్‌లపై పట్టు సాధించాడు.
అమ్మ దగ్గర నుంచి తీసుకొన్న పదివేల రూపాయాల పెట్టుబడితో 2011లో సోషల్ కనెక్టివీటి ప్లాట్‌ఫాం గ్రూప్ ఆఫ్ బడ్డీస్, రెండు నెలల తరువాత ఏషియన్ ఫాక్స్ డెవలప్మెంట్(వెబ్ సోల్యూషన్స్), 2013లో మైండ్–ఇన్ అడ్వర్టైజింగ్(మీడియా–మార్కెటింగ్), గ్లోబల్ వెబ్‌మౌంట్(డోమైన్స్, వెబ్సైట్ అండ్ మోర్) కంపెనీలు మొదలుపెట్టాడు.
అయితే అయాన్ పని అంత సులువు కాలేదు. నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాడు. అయితే ఇదంతా కష్టం అని ఎప్పుడూ అనుకోలేదు. ఆ కష్టంలోనే తనకు ఇష్టమైన ‘కిక్’ని వెతుకున్నాడు. మొదట్లో ఈ చిన్నవాడిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. తమ దగ్గరకు వచ్చే మార్కెటింగ్ సేల్స్మెన్లకు ఇచ్చిన ప్రాధాన్యత కూడా ఇచ్చేవారు కాదు. ఆ తరువాత మాత్రం అయాన్‌లోని టాలెంట్ పదిమంది దృష్టిలో పడింది.
‘కుర్రోడి లో విషయం వుంది’ అనే నమ్మకం ఏర్పడింది. కస్టమర్ బేస్ పెరిగింది. యూఎస్, యూకే, హాంగ్‌కాంగ్, టర్కీలలో అయాన్ కంపెనీలకు శాఖలు ఉన్నాయి. అనతి కాలంలోనే లక్షలాది మంది కస్టమర్లు ఏర్పడ్డారు. 18 సంవత్సరాల వయసులో ‘యంగ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారాన్ని అందుకున్నాడు. ప్రధాని కార్యాలయం నుంచి ప్రత్యేక ప్రశంసా లేఖ అందుకున్నాడు. నైట్ పార్టీలకు దూరంగా ఉండే అయాన్ చావ్లా ప్రభుత్వ పాఠాశాలల్లోని పేద విద్యార్థులను మోటివెట్ చేయడంలో ముందు ఉంటాడు. క్షణం తీరికలేని వ్యవహారాల్లో నుంచి తీరిక చేసుకొని కాన్ఫరెన్స్, సెమినార్, వెబినార్లలో స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలు ఇస్తుంటాడు. 2014–2015లో ఫ్లోరిడాలో జరిగిన ‘ఎంటర్ప్రైజ్ కనెక్ట్’లో ఉపన్యాసకుడిగా అందరినీ ఆకట్టుకున్నాడు ఈ ఢిల్లీ కెరటం.
‘విలువలు, అంకితభావం, సహనం…ఇలాంటివి మా అమ్మ నుంచి అందిపుచ్చుకున్నాను. ఆమె నా కలల పట్ల కఠినంగా వ్యవహరించి ఉంటే ఇన్నివిజయాలు అందని ద్రాక్ష లానే ఉండేవి’ అంటాడు తన తల్లి కుంజమ్ చావ్లా గురించి. అయాన్ చావ్లా కంపెనీ ట్యాగ్‌లైన్‌లోనే అసలు విజయరహస్యం దాగుంది.