ఐటీ దిగ్గజ సంస్థ విప్రో అధినేత శ్రీ అజీం ప్రేమ్‌జీ దాతృత్వంలోనూ ముందంజ లో నిల్చారు. రోజుకు సుమారు రూ. 22 కోట్ల చొప్పున గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 7,904 కోట్లు విరాళమిచ్చారు. తద్వారా 2019–20 సంవత్సరానికి గాను హురున్ రిపోర్ట్ ఇండియా, ఎడెల్‌గివ్ ఫౌండేషన్ రూపొందించిన దానశీలుర జాబితాలో అగ్రస్థానం కైవసం చేసుకున్నారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ప్రేమ్‌జీ రూ. 426 కోట్లు విరాళమిచ్చారు. ఇక తాజా లిస్టులో సుమారు రూ. 795 కోట్ల విరాళంతో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అధినేత శ్రీ శివ నాడార్ రెండో స్థానంలో నిలవగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత శ్రీ ముకేశ్ అంబానీ రూ. 458 కోట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో శివ నాడార్ రూ. 826 కోట్లు, అంబానీ రూ. 402 కోట్లు విరాళమిచ్చారు. కరోనా వైరస్ మహమ్మారి పరిణామాలతో కార్పొరేట్ల విరాళాలు ఇచ్చే తీరులో కొంత మార్పు కనబడుతోంది.
కరోనాపై పోరాటానికి టాటా సన్స్ అత్యధికంగా రూ. 1,500 కోట్లు ప్రకటించగా, ప్రేమ్‌జీ రూ. 1,125 కోట్లు ప్రకటించారు. కార్పొరేట్లు అత్యధిక మొత్తం విరాళాలను పీఎం–కేర్స్ ఫండ్‌కే ప్రకటించడం గమనార్హం. ఈ ఫండ్కే లయన్స్ ఇండస్ట్రీస్ రూ. 500 కోట్లు, ఆదిత్య బిర్లా గ్రూప్ రూ. 400 కోట్లు, టాటా గ్రూప్ రూ. 500 కోట్లు ప్రకటించాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే మొత్తం విరాళాల పరిమాణం సుమారు 175 శాతం పెరిగి రూ. 12,050 కోట్లకు చేరినట్టు నివేదికలో వెల్లడైంది. రూ. 10 కోట్లకు మించి దానమిచ్చిన వ్యక్తుల సంఖ్య స్వల్పంగా 72 నుంచి 78కి పెరిగింది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులు ముగ్గురు.. నందన్ నీలేకని (రూ. 159 కోట్లు), ఎస్ గోపాలకృష్ణన్ (రూ. 50 కోట్లు), ఎస్‌డీ శిబులాల్ (రూ. 32 కోట్లు) ఎడెల్‌గివ్ జాబితాలో ఉన్నారు.
విద్యారంగానికి అత్యధికంగా విరాళాలు అందాయి. ప్రేమ్‌జీ, నాడార్‌ల సారథ్యంలో సుమారు 90 మంది సంపన్నులు దాదాపు రూ. 9,324 కోట్లు ప్రకటించారు. ఆ తర్వాత స్థానంలో హెల్త్‌కేర్, విపత్తు నివారణ విభాగాలు నిలిచాయి. భారీ విరాళాలు ఇచ్చిన వారిలో అత్యధికంగా ముంబైకి చెందిన వారు 36 మంది ఉండగా, ఢిల్లీ వాసులు 20 మంది, బెంగళూరుకు చెందిన వారు 10 మంది ఉన్నారు. రూ. 5 కోట్లకు పైగా విరాళమిచ్చిన 109 మంది సంపన్నులతో రూపొందించిన ఈ జాబితాలో ఏడుగురు మహిళలు ఉన్నారు. మహిళల జాబితాలో నందన్ నీలేకని సతీమణి శ్రీమతి రోహిణి నీలేకని అత్యధికంగా రూ. 47 కోట్లు విరాళమిచ్చారు.అజీం ప్రేమ్‌జీ దాతృత్వం మేటి.