కొబ్బరాకుల పందిరి..అరటి చెట్లతో అలంకారం.. వరి కంకులతో తీర్చిదిద్దిన కల్యాణ వేదిక, అక్కడక్కడా బంతి పూలు చుట్టుకున్న తాటాకు గొడుగులు.. ఎటుచూసినా పచ్చదనంతో అతిథులు ఆశ్చర్యపోయేలా రూపొందించిన మంటప ప్రాంగణం.. విజయనగరంలో ఓ కుటుంబం పర్యావరణ హితంగా రూపొందించిన ఈ వివాహ వేదిక చూపరులను అమితంగా ఆకట్టుకుంది. కుమార్తె వివాహంలో ప్లాస్టిక్ వినియోగించకూడదని దృఢంగా నిర్ణయించుకున్న తూనుగుంట్ల గుప్త,విజయ దంపతులు అందుబాటులో ఉన్న చెట్ల కొమ్మలు, ఆకులు, పువ్వులే అలంకారాలుగా తెలుగుదనం ఉట్టిపడేలా, సంప్రదాయబద్ధంగా పెళ్లి నిర్వహించారు. భోజన విందులోనూ మంచి నీళ్ల దగ్గర్నుంచి, కిళ్లీ వరకూ ఆరోగ్యానికి మేలు చేకూర్చే పదార్థాలనే ఉపయోగించారు.
విజయనగరంలోని మన్నార్ వేణుగోపాలస్వామి ఆలయంలో బుధవారం రాత్రి జరిగిన ఈ వివాహ కార్యక్రమములో ఎక్కడా ప్లాస్టిక్ వాసనే లేదు. అతిథులకు మట్టి గ్లాసులో ఉసిరి, జీలకర్రతో చేసిన షర్బత్తో పాటు ఉడికించిన వేరుశనగ గుళ్లు, రాగి (చోడి) సున్నుండలు స్వాగతం పలికాయి. వధూవరుల పేర్లు సూచించే పట్టికను కూడా కొబ్బరి ఆకులతో అల్లిన తడిక మీద చేనేత వస్త్రంపై సహజ రంగులతో రాయించారు. కేవలం అరటి, కొబ్బరి ఆకులతోనే మంటపాన్ని అలంకరించి, వరి కంకులను గుత్తులుగా వేలాడదీశారు.
ప్రతిమనిషీ పర్యావరణ హితంగా ఉండాలనేది మా అమ్మాయి మౌనిక కోరిక. తన వివాహాన్ని ప్లాస్టిక్ రహితంగా జరిపించాలని అడిగింది. మంచినీళ్లు కూడా వట్టివేరు, చిల్లగింజలు, దాల్చిన చెక్క, తుంగముస్టా, జీలకర్ర వేసి మరగబెట్టి చల్లార్చి వడకట్టి మరీ వినియోగించాం. నిజానికి నాలుగేళ్లుగా ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించుకున్నాం. మా ఇంటికి వచ్చేవారు కూడా ప్లాస్టిక్ తీసుకురావద్దని, ఎవరైనా తీసుకువస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఇంటి బయట బోర్డు కూడా వేళ్ళాడదీసామ్ – తూనుగుంట్ల విజయ, వధువు తల్లి, విజయనగరం