అవకాశం వచ్చేంతవరకే అవస్థలు. ఒక్కసారి అవకాశం గుమ్మం తట్టి, తదుపరి సక్సెస్ అయ్యామా ఇక గారెల బుట్టలో పడ్డ చందమే. హీరోయిన్ల విషయంలో ఇది ఎన్నోసార్లు ఋజువు అయ్యింది. తాజాగా కన్నడ కథానాయకి రష్మిక మందన్నా పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ నిర్మాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కన్నడ చిత్ర పరిశ్రమలో లక్షల్లోనే పారితోషికం అందుకున్న ఈ భామ టాలీవుడ్‌కు మకాం మార్చాక రేటు అమాంతం పెంచేసింది. తెలుగులో తొలి చిత్రం ‘ఛలో’తో ప్రేక్షకులను తన బుట్టలో వేసుకున్న ఈ భామ, ఆ తర్వాత నటించిన ‘గీతా గోవిందం’ తో బంపర్ హిట్ కొట్టింది. దీంతో బడా నిర్మాతల ఆమె చుట్టూ క్యూ కట్టారు.
అలా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని అందెపుచ్చుకుంది . దీంతో రష్మిక తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. అయితే గీతాగోవిందం సక్సెస్ వరకు ఆమె ఒక్క సినిమాకు రూ.50 లక్షలలోపే వసూలు చేసింది. కానీ సంక్రాంతి బరిలోకి దిగిన మహేశ్‌బాబు సూపర్ డూపర్ హిట్ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ విజయంతో రష్మిక తన రెమ్యూనరేషన్‌ను రెండు కోట్ల రూపాయలకు పెంచిందని వినికిడి. తెలుగులో కొన్నేళ్లుగా సినిమాలు చేస్తున్న కొందరు హీరోలు కూడా ఇంత పారితోషికం అందుకోకపోవడం గమనార్హం. కాగా రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప’, శర్వానంద్ ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ చిత్రంలో నటిస్తోంది.